|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:48 PM
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై వస్తున్న వదంతులకు ఆయన స్వయంగా తెరదించారు. చిత్ర బృందంతో విభేదాల కారణంగానే శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని అడివి శేష్ స్పష్టం చేశారు. కేవలం డేట్ల సర్దుబాటు సమస్య వల్లే ఈ మార్పు జరిగిందని ఆయన వివరించారు.ఈ విషయంపై అడివి శేష్ మాట్లాడుతూ, "శృతి హాసన్ మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కూలీ’లో నటిస్తుండటంతో మా సినిమాకు డేట్స్ కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తాయి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి రావడంతో ఆమె ‘డెకాయిట్’కు పూర్తిస్థాయిలో సమయం ఇవ్వలేకపోయారు. అందుకే పరస్పర అంగీకారంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు గానీ, మనస్పర్థలు గానీ లేవు" అని తేల్చిచెప్పారు. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది.షేనియల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ సినిమా ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మొదట ఈ చిత్రంలో అడివి శేష్ సరసన శృతి హాసన్‌ను కథానాయికగా ఎంపిక చేసి, కొంత భాగం చిత్రీకరణ కూడా జరిపారు. అయితే అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో, ఆమె స్థానంలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.ప్రస్తుతం ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అడివి శేష్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాతో కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
Latest News