|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 02:27 PM
కొన్ని పాటలు విన్న వెంటనే భలే నచ్చేస్తాయి. మరికొన్ని సినిమా చూసిన తర్వాత ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని ఎప్పుడు... ఎక్కడ.. విన్నా మనల్ని హమ్ చేసేలా చేస్తాయి. అలాంటి వాటిలో 'సారొస్తారా' సాంగ్ ఒకటి. మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'బిజినెస్‌మెన్. కాజల్ అగర్వాల్ కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఇందులోని పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సారొస్తారా' ఎవర్‌గ్రీన్. ఈ పాటను కేవలం 12 నిమిషాల్లోనే తమన్, భాస్కర భట్ల కలిసి రెడీ చేశారంటే నమ్ముతారా? అవును మీరు చదివింది నిజమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ''బిజినెస్‌మెన్' షూటింగ్ కోసం అందరం గోవా వెళ్లాం. అప్పటికి 'దూకుడు' హిట్ అయి మంచి జోష్‌లో ఉన్నాం. నేను కంపోజ్ చేసిన కొన్ని పాటల్లో ఎక్కువగా యాటిట్యూడ్ పదాలను వాడాను. ఒకరోజు పూరి జగన్నాథ్‌గారి దగ్గరకు వెళ్లి, 'సర్.. మహేశ్‌బాబుకు అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలో ఒక్క మెలోడీ అయినా పెడితే బాగుంటుంది' అని అన్నాను. 'అవునా! ఎక్కడ కుదురుతుంది? ఫలానా సీన్‌లో అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది కదా..! అక్కడ వచ్చేలా డిజైన్ చేసుకుందాం. నేను పది నిమిషాల్లో వస్తాను. నువ్వూ భాస్కరభట్ల వెళ్లి ఆ పాట సంగతి చూడండి' అన్నారు. ఇద్దరం కలిసి రూమ్‌కి వెళ్లి ట్యూన్ చేయడం మొదలు పెట్టాం. నేను 'తారత్తరత్తారే.. రత్తారత్తారత్తారే..' అంటూ ట్యూన్ వినిపించాను. భాస్కర భట్ల వెంటనే 'సారొస్తారా' అని పాటను రాసి ఇచ్చేశారు'' ''10-12 నిమిషాల తర్వాత పూరి జగన్నాథ్‌గారు, సుబ్బరాజు ఇద్దరూ రూమ్ వచ్చారు. వాళ్లకు బాగా నచ్చింది. ఆ తర్వాత రాంగోపాల్‌వర్మ వస్తే, ఆయనకు వినిపించాము. 'ఇలాంటి సినిమాలో సారొస్తారా.. వెళ్తారా.. పాటలేంటి? ఆటలాడుతున్నారా' అని అన్నారు. దీంతో పూరిగారు సందిగ్ధంలో పడ్డారు. బాల్‌ను మహేశ్‌బాబు కోర్టులోకి నెట్టారు. మరుసటి రోజు 'దూకుడు' 100 రోజుల ఫంక్షన్ ఉంటే, అందరం వెళ్లాం. అక్కడ మహేశ్‌బాబుకు ఈ పాట వినిపిస్తే, 'మైండ్ బ్లోయింగ్ తమన్' అన్నారు. దీంతో 'సారొస్తారా' ఉంచాలని నిర్ణయించాం. ఈ పాట సినిమాకు పెద్ద అసెట్ అయింది. తమకు బాగా డబ్బులు కూడా వచ్చాయని ఆడియో కంపెనీ కూడా చెప్పింది'' అని తమన్ చెప్పుకొచ్చారు.
Latest News