|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:27 PM
జూన్ నెల ప్రథమార్థం అంతా నిస్సారంగా సాగిపోతోందనే చెప్పాలి. జూన్ ఫస్ట్ వీకెండ్ లో విఉడదలైన 'థగ్ లైఫ్' సినిమా పరాజయం పాలు కావడం, దానితో పాటే వచ్చిన నాలుగైదు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇక జూన్ 12న రావాల్సిన 'హరిహర వీరమల్లు' మూవీ సైతం విడుదల వాయిదా పడటంతో ఈ వారం మరింత దారుణంగా తయారైంది. స్ట్రయిట్ తెలుగు సినిమాను విడుదల చేయడానికి ఎవరూ ఆసక్తిచూపడంలో లేదు. దాంతో 13వ తేదీ శుక్రవారం అనువాద చిత్రాలదే హవాగా కనిపిస్తోంది. అయితే ఇవి కూడా స్ట్రయిట్ సినిమాలు కావు. గతంలో విడుదలైన సినిమాలే ఇప్పుడు రాబోతున్నాయి.సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'తీర్పుగళ్ విర్కపడుమ్'. ఇది తమిళనాట నాలుగేళ్ళ క్రితం విడుదలైంది. ఇప్పుడీ సినిమాను 'కట్టప్ప జడ్జిమెంట్' పేరుతో వెంకటస్వామి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. 'బాహుబలి' తర్వాత కట్టప్పగా సత్యరాజ్ కు వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. ఇందులో తెలుగువాడైన మధుసూదనరావు విలన్ గా నటించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను ధేరన్ డైరెక్ట్ చేశారు. స్మృతి వెంకట్, హరీశ్ ఉత్తమన్, రవిప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 13వ తేదీ సినిమా విడుదల అవుతోంది. అలానే ఎ. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి తమిళనాడులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగానూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అలా అతను నటించగా గత యేడాది విడుదలైన సినిమా 'రణం'. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను షరీఫ్ డైరెక్ట్ చేశారు. తెలుగు వారికి సుపరిచితులైన నందితా శ్వేత, తన్యా హోప్ ఇందులో కీ-రోల్స్ ప్లే చేశారు. నటుడిగా ఇది వైభవ్ రెడ్డికి 25వ సినిమా. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో 'ది హంటర్ : చాప్టర్ 1' పేరుతో డబ్ చేసి 13న జనం ముందుకు తీసుకొస్తున్నారు.తమిళం నుండి తెలుగులోకి వస్తున్న మరో ఆసక్తికరమైన అనువాద చిత్రం 'పా... పా...'. తమిళంలో 'దా... దా...'గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కవిన్, అపర్ణ దాస్ కీలక పాత్రలు పోషించారు. గణేశ్ కె బాబు దీనిని డైరెక్ట్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ను ఈ సినిమాను దర్శకుడు హృద్యంగా తెరకెక్కించాడు. ఈ సినిమాను తెలుగులో నీరజ కోట 'పా.. పా...' పేరుతో డబ్ చేశారు. జనవరి 3న దీన్ని విడుదల చేశారు కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో ప్రదర్శనకు స్వస్తి పలికి, ఇప్పుడు మరోసారి కాస్తంత పబ్లిసిటీ జత చేసి 13న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ మూడు తమిళ అనువాద చిత్రాలు కాకుండా హాలీవుడ్ మూవీ 'బల్లెరినా' కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లో దీనిని డబ్ చేస్తున్నారు. జాన్ విక్ ఫ్రాంచైజ్ లో ఐదవ చిత్రం ఇది. అనా డి ఆర్మాస్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. కేను రీవ్స్, లాన్స్ రెడిక్, ఆంజెలికా హుస్టన్, గాబ్రియల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను లెన్ వైజ్మాన్ డైరెక్ట్ చేశారు. అలానే ఆంగ్ల చిత్రం 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్' సైతం తెలుగులో డబ్ అవుతోంది. దీన్ని త్రీడీ వర్షన్ లోనూ రిలీజ్ చేస్తున్నారు. పిల్లలను టార్గెట్ చేస్తూ తీసిన ఈ అడ్వంచర్, ఫ్యామిలీ, ఫాంటసీ మూవీని ఎంపిక చేసిన కొద్ది థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు.
Latest News