|
|
by Suryaa Desk | Sat, Aug 31, 2024, 03:18 PM
సిల్వర్ మూవీవ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత రాజన్ జోసెఫ్ థామస్ తన స్నేహితుడు సంతోష్ గోపినాథ్ కోసం నిర్మించిన చిత్రం ‘సేవకర్’. ఎప్పటికైనా సినిమాను నిర్మించి, ఆ పోస్టరుపై తన పేరు ఉండాలన్న కలను సాకారం కూడా చేసుకున్నారు. ప్రిజన్, షకానా జంటగా నటించిన ఈ చిత్రంలో బోస్ వెంకట్, ఆడుకలం నరేన్, మదురై శరవణన్, ఉడుమలై రాజేష్, హీమా శంకరి, రూపా, సునీల్, బాలు, షాజి కృష్ణ, సాయి శంకర్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. సంతోష్ గోపినాథ్ కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ఆర్‌డీ మోహన్ సంగీతం అందించగా, ప్రదీప్ నాయర్ ఛాయాగ్రహణం సమకూర్చారు.ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా నిలబడే వ్యక్తి హీరో. అతనికి అండగా నిలబడే నలుగురు స్నేహితులు. అన్యాయంతో పాటు అకృత్యాలకు పాల్పడుతున్న రాజకీయ నేత పాత్రలో ఆడుకలం నరేన్ నటించారు. స్వతహాగా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగిన ప్రిజన్.. తన న్యాయపరమైన చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించే దుష్టశక్తులను నాశనం చేయాలని భావిస్తాడు. దీంతో ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతాయి. అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. అలాంటి సమయంలో పోలీస్ అధికారిగా ఉన్న బోస్ వెంకట్ నుంచి అమూల్యమైన సూచనలు సలహాలు పొందుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వెండితెరపై చూడాల్సిందే’ అని వారు వివరించారు. తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. టీజర్, ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
Latest News