|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 05:50 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజాసాబ్' చిత్రంపై ప్రముఖ రచయిత, దర్శకుడు కోన వెంకట్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ పెట్టిన పోస్టులో ఒక చిన్న పొరపాటు దొర్లడంతో, ప్రభాస్ అభిమానుల నుంచి ఆయన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అభిమానుల స్పందనతో వెంటనే అప్రమత్తమైన ఆయన, తన తప్పును సరిదిద్దుకుంటూ మరో ట్వీట్ చేశారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'ది రాజాసాబ్' సినిమాకు సంబంధించి కోన వెంకట్ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. "'ది రాజాసాబ్' టీజర్ ఇప్పుడే చూశాను. నన్ను నమ్మండి, ఈ జానర్‌లో ఇండియాలోనే ఇది అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ప్రభాస్ నటన అద్భుతం. దర్శకుడు మారుతి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ విలువలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. 2026 జనవరి 9న బాక్సాఫీస్ వద్ద సునామీ కోసం సిద్ధంగా ఉండండి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.అయితే, ఈ ట్వీట్‌ను చూసిన ప్రభాస్ అభిమానులు వెంటనే స్పందించారు. ఆయన 'టీజర్' అని పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. "మీరు చూసింది ట్రైలర్, సరిచూసుకోండి" అంటూ కామెంట్లతో హోరెత్తించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది.అభిమానుల నుంచి వస్తున్న స్పందనను గమనించిన కోన వెంకట్, వెంటనే మరో ట్వీట్ ద్వారా తన పొరపాటును అంగీకరించారు. "దయచేసి క్షమించండి. నేను చూసింది టీజర్ కాదు, ట్రైలర్" అని వివరణ ఇచ్చారు. దీంతో ఈ చర్చకు తెరపడింది.
Latest News