|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 09:20 AM
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమా చిత్రీకరణ కోసం తాము పడిన శ్రమను, ఎదుర్కొన్న సవాళ్లను తేజ తాజాగా మీడియా ముందు పంచుకున్నారు. సినిమాను సహజంగా తెరకెక్కించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడిందని, కొన్నిసార్లు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో తేజ మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ చాలా కష్టంగా సాగింది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో చిత్రీకరణ సవాలుగా మారింది. ఒక్క షాట్ కోసం రోడ్లు కూడా సరిగా లేని ప్రదేశాలకు గంటల తరబడి ప్రయాణించాం. వాహనాలు వెళ్లలేని చోట కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. హిమాలయాలు, నేపాల్, బ్యాంకాక్, ముంబై సహా ఎన్నో లొకేషన్లలో షూటింగ్ జరిపాం" అని వివరించారు.ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అండగా నిలవడంపై తేజ సంతోషం వ్యక్తం చేశారు. "మొదట మా సినిమా టీజర్, గ్లింప్స్ చూసి కరణ్ సార్ చాలా ఇష్టపడ్డారు. కేవలం నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. కానీ, సినిమా చూసిన తర్వాత ఆయనే స్వయంగా సమర్పించేందుకు ముందుకొచ్చారు. పరిమిత వనరులతో మేము పడిన కష్టం, తపన చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మా ప్రతిభను పెద్ద వేదికపైకి తీసుకెళ్లాలని ఆయన భావించారు. ఆయనకు నా కృతజ్ఞతలు" అని తేజ తెలిపారు.
Latest News