|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:29 PM
సినీ నటి సయామీ ఖేర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటైన 'ఐరన్‌మ్యాన్ 70.3' ట్రయాథ్లాన్‌ను ఏడాది తిరిగేలోపే రెండుసార్లు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2024 సెప్టెంబర్‌లో మొదటిసారి, 2025 జులైలో రెండోసారి ఆమె ఈ రేసును విజయవంతంగా ముగించారు. అయితే, తాను ఈ పోటీలో పాల్గొన్నది రికార్డుల కోసం కాదని, తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసమేనని సయామీ స్పష్టం చేశారు.ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ అంటే మాటలు కాదు. ఇందులో పాల్గొనేవారు ఒకే రోజు వరుసగా 1.9 కిలోమీటర్లు ఈత కొట్టాలి, 90 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి, ఆ తర్వాత 21.1 కిలోమీటర్లు పరుగు పెట్టాలి. ఇంతటి కఠినమైన రేసును పూర్తి చేయడానికి అసాధారణమైన శారీరక, మానసిక స్థైర్యం అవసరం.ఈ సందర్భంగా సయామీ ఖేర్ మాట్లాడుతూ... "ఐరన్‌మ్యాన్ ఇండియాకు ప్రచారకర్తగా ఉండటం నాకు దక్కిన గౌరవం. అభిరుచి, నిలకడ, వదిలిపెట్టని పట్టుదల వంటి నేను నమ్మే విలువలన్నిటికీ ఈ ప్రయాణం ఒక ప్రతీక. ఏడాదిలో రెండుసార్లు ఈ రేసును పూర్తిచేయడం రికార్డుల కోసం కాదు, నా పరిమితులను నేను సవాలు చేసుకోవడం కోసం చేశాను" అని తెలిపారు.
Latest News