|
|
by Suryaa Desk | Sun, Oct 05, 2025, 08:02 PM
మంచి మార్కులు, గ్రేడులే జీవితంలో సర్వస్వం కావని, వాటికంటే ముఖ్యమైనవి మానవతా విలువలని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు అన్నారు. విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిపై ఆమె స్పందిస్తూ, చదువుతో పాటు మంచి మనుషులుగా ఎదగడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఆదివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. "చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి సమయం దొరకడం లేదు" అని ఆ విద్యార్థి ప్రశ్నించగా, సమంత స్పందించారు. "నిజాయతీగా చెప్పాలంటే నేను విద్యార్థిగా ఉండి చాలా కాలమైంది. కానీ ప్రస్తుత విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వింటున్నాను. వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది" అని అన్నారు.తాను పాఠశాలలో చదువుకున్న విషయాలు ఇప్పుడు ఏవీ గుర్తులేవని, కానీ ఆ సమయంలో నేర్చుకున్న స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని సమంత వివరించారు. "మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను పాఠశాలలోనే నేర్చుకున్నాను. జీవితంలో ముందుకు సాగడానికి అవే నాకు తోడ్పడ్డాయి" అని ఆమె తెలిపారు. విద్యార్థులు మంచి గ్రేడులకే పరిమితం కాకుండా ఈ విలువలను అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు.ఈ సందర్భంగా, 2023లో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపే ఓ వార్తా కథనాన్ని ఆమె పంచుకుని తన విచారాన్ని వ్యక్తం చేశారు.ఇదే సమయంలో తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా సమంత ఓ శుభవార్త పంచుకున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త తెలుగు సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.
Latest News