|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 05:42 PM
సాధారణంగా ఏదైనా ఒక యానిమేషన్ సినిమా విడుదలైతే, అది పిల్లలు మాత్రమే చూసే సినిమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక అభిప్రాయాన్ని మార్చేసిన సినిమాగా 'మహావతార్ నరసింహ' గురించి చెప్పుకోవచ్చు. హోంబలే ఫిలిమ్స్ వారు సమర్పించిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా, ఆ తరువాత తన జోరు చూపించింది. 40 కోట్లతో నిర్మితమై 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.
కథ: కశ్యప మహర్షి .. 'దితి' దంపతులు అసురసంధ్య వేళలో కలుసుకోవడం వలన, హిరణ్యాక్షుడు - హిరణ్య కశిపులు అసురులుగా జన్మిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా లోక కంటకులుగా మారతారు. వారి కారణంగా సాధుజనుల మొదలు దేవతలవరకూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హిరణ్యాక్షుడు భూమిని పాతాళ లోకానికి తీసుకుని వెళతాడు. దాంతో భూదేవిని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు వరాహావతారాన్ని ధరిస్తాడు. పాతాళలోకం నుంచి భూమిని పైకి తీసుకువస్తూ అందుకు అడ్డుపడిన హిరాణ్యాక్షుడిని సంహరిస్తాడు. సోదరుడి మరణం హిరణ్య కశిపుడిని కలిచివేస్తుంది. తన సోదరుడి మరణానికి కారకుడైన విష్ణుమూర్తిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మ దేవుడి గురించి హిరణ్య కశిపుడు కఠోర తపస్సు చేస్తాడు. తనకి మానవుల వలనగానీ .. మృగాల వలనగానీ .. పగలు - రాత్రి, ఇంటా బయటా ..నింగి - నేలపై .. ఎలాంటి ఆయుధాల వలన మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమని కోరతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు.హిరణ్య కశిపుడు తన రాజ్యంలో ఎక్కడా హరి నామస్మరణ జరగకుండా శాసనాలు చేస్తాడు. అయితే అతని ద్వారా లీలావతికి జన్మించిన ప్రహ్లాదుడు, హరి నామస్మరణ చేయకుండా ఉండలేని స్థితికి చేరుకుంటాడు. తాను తల్లి గర్భంలో ఉండగా, నారద మహర్షి చేసిన హరి కథామృతమే అందుకు కారణం. ఎంతగా హెచ్చరించినా ప్రహ్లాదుడు హరి నామ స్మరణ మానకపోవడంతో, అతనిని అంతం చేయాలని హిరణ్యకశిపుడు తన అనుచరులను ఆదేశించడంతో ఈ కథ పాకాన పడుతుంది.
Latest News