|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 04:46 PM
పుష్ప, పుష్ప-2 చిత్రాలతో జాతీయ స్థాయిలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌తో త్వరలో తెరకెక్కించబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. కథా చర్చలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. 'రంగస్థలం' లాంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం సుకుమార్ తన సొంత సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో రూపొందబోయే ఆరు ప్రాజెక్టులను కూడా ఓకే చేశారని తెలిసింది. త్వరలోనే వాటిని కూడా ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఒకవైపు దర్శకత్వంతో పాటు మరో వైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా కూడా సుకుమార్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సుకమార్ రైటింగ్స్ సంస్థ పది వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ పదేళ్ల కాలంలో కుమారి 21ఎఫ్, విరూపాక్ష,ఉప్పెన, 18 పేజేస్, పుష్ప-2, గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలను ఇతర పేరొందిన సంస్థలతో కలిసి నిర్మించింది. వీటితో పాటు ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'పెద్ది', నాగచైతన్య, 'విరూపాక్ష' దర్శకుడు కార్తిక్ దండు కలయికలో తెరకెక్కుతోన్న సినిమాతో పాటు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్‌చరణ్-సుకుమార్ కాంబో సినిమాకు కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు సుకుమార్ రైటింగ్స్‌లో ఓకే చేసిన ఆరు స్క్రిప్టులు కూడా నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైనే తెరకెక్కడానికి సిద్దంగా ఉన్నాయట. అయితే ఈ చిత్రాల్లో నటించే నటీనటులు ప్రస్తుతానికి ఫైనల్ కాలేదు.
Latest News