|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:24 PM
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు సినీ రంగంలో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. మంచి కంటెంట్‌తో వస్తే హీరో ఎవరన్నది పట్టించుకోకుండా హిట్ చేస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ‘మిరాయ్’. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా సాగే ఈ కథలో ‘మహాబీర్ లామా’ పాత్రలో మంచు మనోజ్ కొత్తగా కనిపించగా తేజ సజ్జా మరోసారి తన నటనతో యూత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, కథనం, టెక్నికల్ ప్రెజెంటేషన్‌తో కొత్త రేంజ్‌లో సినిమాను తీర్చిదిద్దాడు. వీఎఫ్ఎక్స్ వర్క్, యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు వెండితెరపై మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రితికా నాయక్ , శ్రియా చరణ్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.112.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. పెద్ద సినిమాలు లేని వారం రోజులు మిరాయ్‌కు బలం చేకూరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News