|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 06:19 AM
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ, భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 51 డీఆర్ఎఫ్, 151 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు. హైడ్రా బృందం 9 బోట్లను, ఎన్డీఆర్ఎఫ్ 6 బోట్లను సిద్ధంగా ఉంచిందని అన్నారు. హైదరాబాద్ నగరంలో 450 వరకు నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉందని తెలిపారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు