|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:19 PM
మెగాస్టార్ చిరంజీవి ఒక రియల్ హీరోను కలిసి తన ఆనందాన్ని, ఉద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు. అసాధారణ శౌర్య పరాక్రమాలకు గాను ‘కీర్తి చక్ర’ పురస్కారం అందుకున్న భారత సైనిక అధికారి మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడిని ఆయన ఇటీవల కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ, ఆ వీర సైనికుడిపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా చిరంజీవి తన పోస్ట్‌లో భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. "2023 ఆగస్టులో అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి ‘కీర్తి చక్ర’ గెలుచుకున్న మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఆయన చూపిన శౌర్యం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు.అంతేకాకుండా "దేశం కోసం నిలబడిన ఈ ధైర్యవంతుడైన సైనికుడు, నన్ను ఒక అభిమానిగా తన గుండెల్లో పెట్టుకున్నారని తెలియడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆయన చూపిన ఆప్యాయతకు, మధుర జ్ఞాపకాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ దేవుడు ఆయనకు, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.
Latest News