|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:20 PM
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం సుమారు రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాలు, ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు మరో భారీ కొనుగోలుకు సిద్ధమైంది.ఈ కొత్త కొనుగోళ్లలో భాగంగా భారత నౌకాదళం కోసం అత్యాధునిక ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పీడీ), నావల్ సర్ఫేస్ గన్స్, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ సిస్టమ్స్ వంటివి సమకూర్చనున్నారు. ఎల్‌పీడీల ద్వారా ఆర్మీ, వైమానిక దళాలతో కలిసి నౌకాదళం ఉభయచర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.