|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:19 PM
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మొదటి కృత్రిమ వర్షం పడనుందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.ఈ చారిత్రాత్మక ప్రయోగం కోసం గురువారం బురారీ ప్రాంతంలో నిపుణులు జరిపిన పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆమె తెలిపారు. "క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీలో సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆకాశంలో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే కాలుష్య నివారణకు ఒక శాస్త్రీయమైన పద్ధతిని ఏర్పాటు చేసిన వాళ్లమవుతాం" అని సీఎం రేఖా గుప్తా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా రాజధానిలో స్వచ్ఛమైన గాలిని, సమతుల్య వాతావరణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.