![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:50 PM
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ సుజుకి మోటార్, తమ పాప్యులర్ మోడల్ అయిన స్విఫ్ట్ కారు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనా ప్రభుత్వం రేర్ ఎర్త్ (అరుదైన మృత్తికలు) పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఆంక్షల వల్ల అవసరమైన విడిభాగాలు లభించకపోవడంతో సుజుకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.చైనా రేర్ ఎర్త్స్ ఎగుమతులపై విధించిన ఆంక్షల వల్ల ప్రభావితమైన తొలి జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి కావడం గమనార్హం. స్విఫ్ట్ సబ్‌కాంపాక్ట్ మోడల్ (స్విఫ్ట్ స్పోర్ట్ మినహా) ఉత్పత్తిని మే 26 నుంచి జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. విడిభాగాల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో పేర్కొన్నప్పటికీ, ఆ కొరతకు దారితీసిన కారణాలను సుజుకి అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఉత్పత్తి నిలిపివేతకు సంబంధించిన కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించినట్లు తెలిసింది. ఈ వార్తను తొలుత నిక్కీ బిజినెస్ డైలీ పత్రిక ప్రచురించింది.