|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 04:30 PM
మాజీమంత్రి, సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు బన్సీలాల్ పేట డివిజన్‌లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద స్వయంగా ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లు తమ రోజువారీ ఆదాయం తగ్గిపోవడం, కుటుంబాలను పోషించుకోవడానికి పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులు వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆటో డ్రైవర్ల ఓట్లను దండుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆటో నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదని ఆరోపించారు. రెండేళ్ల బకాయి రూ. 24 వేలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ వేధింపులు, ఇష్టానుసారంగా విధిస్తున్న జరిమానాల కారణంగా 161 మంది ఆటో డ్రైవర్లు మరణించారని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గి ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం మరింత వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన గుర్తు చేశారు. కేవలం ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాశతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం, పెన్షన్ రూ. 4 వేలకు పెంపు వంటి అనేక హామీలను మేనిఫెస్టోలో పెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు తగులుతుందని తలసాని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై లక్ష ఆటోలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జీ గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.