|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 04:26 PM
నార్మల్‌గా రైల్వే స్టేషన్ అంటేనే ఇరుకిరుకుగా, సరిగా సౌకర్యాలు లేని విధంగా ఉంటాయనే అపవాదు ఉంది. అయితే, ఈ పరిస్థితిని మార్చే దిశగా భారతీయ రైల్వేలు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి హంగులతో అందుబాటులోకి రాగా, త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రపంచ స్థాయి హంగులతో సిద్ధం కానుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్ర రాజధానిలోనే అత్యంత బిజీగా ఉండే స్టేషన్లలో ఒకటి. ఈ స్టేషన్ నుండి రోజుకు సగటున 180 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణిస్తున్నారు. రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కారణంగా, ప్రస్తుత స్టేషన్ సరిపోక, దీన్ని అభివృద్ధి చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
సికింద్రాబాద్ స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్-1 (NSG-1) స్టేషన్‌గా గుర్తించారు. ఏడాదికి రూ. 500 కోట్ల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించే స్టేషన్లను ఈ గ్రేడ్ కిందకు వర్గీకరిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రధాని నరేంద్ర మోడీ 2023లో దాదాపు రూ. 720 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారుల ప్రకారం, ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా, జీ+3 అంతస్తులతో నార్త్ సైడ్ కొత్త ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్‌లు, సౌత్ సైడ్ కూడా జీ+3 అంతస్తుల భవనం పనులు జరుగుతున్నాయి.
ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. కేఫ్ ఏరియాలు, వినోద సౌకర్యాల కోసం స్థలాలతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం డబుల్ స్టోరీ స్కై కాన్‌కోర్స్ సిద్ధమవుతోంది. పార్కింగ్ సమస్యలను తీర్చడానికి నార్త్‌సైడ్ బహుళస్థాయి పార్కింగ్ (MLP), సౌత్‌సైడ్ భూగర్భ పార్కింగ్ సౌకర్యాలు రానున్నాయి. నార్త్, సౌత్ వైపున రెండు ట్రావెలేటర్లతో సహా విశాలమైన (7.5 మీటర్ల వెడల్పు) రెండు వాక్‌వేలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, స్టేషన్‌లో మెరుగైన కనెక్టివిటీ కోసం 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లతో పాటు, వివిధ కొలతలలో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FOB) మరియు స్కైవాక్ నిర్మాణాలు జరుగుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ, మొబిలిటీ, ప్రయాణికులకు అనుకూలమైన పికప్-డ్రాప్ ప్రాంతాలు, తగినంత పార్కింగ్, రద్దీని తగ్గించడం, నగరం రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలుగా అధికారులు చెబుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ సైడ్ చేపడుతున్న బేస్మెంట్ నిర్మాణ పనులు దాదాపు 95 శాతం పూర్తికావచ్చాయి. స్టేషన్ పునరాభివృద్ధి పనులు మొదట్లో 2025 నాటికి పూర్తవుతాయని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత పనితీరును దృష్టిలో ఉంచుకుని 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు ప్రయాణికులు మరింత మెరుగైన, ఆధునిక సౌకర్యాలు కలిగిన స్టేషన్‌ను అనుభవించడానికి కొంత కాలం వేచి ఉండక తప్పదు.