|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 11:55 AM
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోయానని, ఈ విషయంలో గట్టిగా కొట్లాడలేకపోయినందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. శనివారం 'తెలంగాణ జాగృతి' ఆధ్వర్యంలో 'జనం బాట' కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు, గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల పట్ల ప్రస్తుత పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1,200 మంది అమరులయ్యారని అనేక సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ, వారి ఆశయాలను నెరవేర్చడంలో ఎంతవరకు ముందుకు వెళ్లామో ఆలోచించుకోవాలని కవిత అన్నారు. ముఖ్యంగా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆమె అంగీకరించారు. ఇప్పటివరకు కేవలం 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని, ఇది సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి రాజకీయ పదవులతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ టిక్కెట్లు దక్కినప్పటికీ, ఉద్యమకారులకు జరగాల్సినంత న్యాయం జరగలేదన్నది వాస్తవం అని కవిత స్పష్టం చేశారు. తాను మంత్రిగా లేకపోయినా, ఎంపీగా ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని గట్టిగా డిమాండ్ చేశానని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని ఆమె పునరుద్ఘాటించారు.
ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ 'జనం బాట' కార్యక్రమాన్ని చేపట్టానని కవిత తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా 33 జిల్లాల్లోని అన్ని వర్గాలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుంటానని ఆమె ప్రకటించారు. 'తెలంగాణ జాగృతి' ద్వారా ఉద్యమకారుల ఆకాంక్షలను, అమరుల త్యాగఫలాలను పూర్తిస్థాయిలో సాధించే దిశగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని కవిత ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.