|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 08:56 PM
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు కోతుల బెడద అతిపెద్ద సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఈ సమస్య మరింత దారుణంగానే ఉంది. అడవుల్లో ఉండాల్సిన కోతులు కాస్తా.. జనావాసాల్లోకి వచ్చి.. ఏది దొరికితే అది తీసుకుని పారిపోతున్నాయి. కొన్నిసార్లు తినడానికి ఏమీ లేకపోతే జనాలపైనా దాడులు చేస్తున్నాయి. దీంతో కోతులు అంటేనే ఇప్పుడు జనం భయపడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ కోతుల బెడదను మాత్రం తీర్చలేకపోతున్నారు. అక్కడక్కడా కోతులను పట్టుకుని వెళ్లి.. అటవీ ప్రాంతాల్లో వదిలేస్తున్నా.. తిరిగి అవి మళ్లీ గ్రామాలపైనే పడుతున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. ఈ కోతులు మనుషులను తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వరంగల్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
వరంగల్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ కోతులను.. వ్యాపారికి విక్రయించినట్లు వార్తలు రావడం పెను దుమారం రేపుతోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో కోతులను పట్టే కాంట్రాక్టర్ ఈ ఘటనకు కారణం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి.. ఆ కాంట్రాక్టర్ కోతులను విక్రయించినట్లు ఆదివారం రోడున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది.
మారుతీ సుజుకీ ఎర్టిగా కారులో ఓ వ్యాపారి వచ్చి ఆ కాంట్రాక్టర్ నుంచి కోతులను ఆ కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం బయటికి వచ్చినట్లు సమాచారం. అది కాస్తా సోషల్ మీడియాలోకి చేరడంతో.. తెగ వైరల్ అవుతోంది. ఆ కాంట్రాక్టర్ నగర పరిధిలో పట్టుకున్న 50 కోతులను.. ఆ హైదరాబాద్ వ్యాపారికి రూ.2 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వరంగల్ నగరం పరిధిలో ఉన్న కోతులను.. కాంట్రాక్టర్లు పట్టుకుని ఆ తర్వాత.. వాటిని ఏటూరునాగారం అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావాల్సి ఉంది. అలాంటి కాంట్రాక్టర్ వ్యాపారికి కోతులను విక్రయిస్తున్నారనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు ఓ జర్నలిస్ట్.. బల్దియా ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది కుక్కలను అతడి మీదికి వదిలేసి తీవ్ర భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.
ఇక ఈ కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు.. బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి స్పందించారు. ఈ కోతుల విక్రయానికి సంబంధించిన సమాచారం తనకు కూడా అందిందని వెల్లడించారు. సోమవారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. ఆ తర్వాతే వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ కాంట్రాక్టర్ కోతులను విక్రయించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఈకోతుల విక్రయానికి సంబంధించిన వార్త వరంగల్ నగరంలో తీవ్ర సంచలనంగా మారింది.