|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 09:26 PM
ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్దలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భర్తపై భార్య.. భార్యపై భర్త అనుమానాలు పెంచుకోవడం పెరిగిపోతోంది. ఇక కొన్ని సార్లు వారిద్దరూ ఘర్షణ పడి.. ఊహించని నిర్ణయం తీసుకుంటూ మిగిలిన కుటుంబ సభ్యులకు కడుపుకోత పెడుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. భార్య అనుమానాస్పద మృతి ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఆమె భర్తనే.. ఆమెను బ్రిడ్జి పైనుంచి కిందికి తోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ వద్ద ఆదివారం రాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మందమర్రి ప్రాంతానికి చెందిన రజిత అనే మహిళను ఆమె భర్త కుమార్ స్వామి హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్త వంతెనపై నుంచి తోసేసి చంపేసినట్లు అనుమానిస్తున్నారు.
అయితే.. సోమవారం ఉదయం ఆ బ్రిడ్జి కింద ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె రజిత అని గుర్తించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రజిత మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే ఈ హత్య రజిత భర్త కుమార్ స్వామి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భార్య ప్రవర్తనపై కుమార్ స్వామికి అనుమానం ఉందని.. ఈ విషయంలోనే తీవ్ర కోపంలో ఉండి.. అతడు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఇప్పటికే నస్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.