|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 04:17 PM
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఓపెన్‌ఏఐ సంచలన విషయాలు వెల్లడించింది. తమ చాట్‌బాట్ చాట్‌జీపీటీతో ప్రతి వారం పది లక్షల మందికి పైగా యూజర్లు ఆత్మహత్య ఆలోచనల గురించి చర్చిస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ఏఐపై ప్రజలు మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతలా ఆధారపడుతున్నారో ఈ డేటా స్పష్టం చేస్తోంది. ఓపెన్‌ఏఐ అంచనాల ప్రకారం.. ప్రతి వారం చాట్‌జీపీటీని వాడే యాక్టివ్ యూజర్లలో 0.15 శాతం మంది ఆత్మహత్యకు సంబంధించిన సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం చాట్‌జీపీటీకి వారానికి 800 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా, ఈ లెక్క పది లక్షలకు పైగానే ఉంటుంది. దాదాపు ఇదే సంఖ్యలో యూజర్లు చాట్‌జీపీటీపై తీవ్రమైన భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారని, లక్షలాది మందిలో మానసిక రుగ్మతల లక్షణాలు కనిపిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది. ఈ సంభాషణలు గణాంకపరంగా చాలా అరుదైనప్పటికీ, తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని ఇది సూచిస్తోంది.