|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 04:11 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా మారింది. ఆదివారం రాత్రి ఇది తుపానుగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుపాను నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడి, సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నేడు పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.