|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 04:09 PM
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లాలో ఓ మహిళను అదృష్టం వరించింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఆమె, లక్కీ డ్రా పద్ధతిలో ఏకంగా రెండు వైన్ షాపులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకేసారి రెండు దుకాణాలు దక్కడంతో స్థానికులు ఆమెను 'లక్కీ లేడీ' అని పిలుస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల హారిక అనే మహిళ లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లోని రెండు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు.ఈ లక్కీ డ్రాలో హారిక పేరు రెండుసార్లు విజేతగా నిలిచింది. ఆమె దరఖాస్తు చేసిన రెండు దుకాణాలు ఆమెకే దక్కాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ, అదృష్టం కలిసిరావడంతో ఆమె ఒకేసారి రెండు దుకాణాలకు యజమాని అయ్యారు.