|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 03:51 PM
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఉండటం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులే ఈ విషయాన్ని గమనించి బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.గంగాధర మండలంలోని కురిక్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు బాలికలు సోమవారం తమ వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా లైట్ వెలుగుతున్న ఓ పరికరాన్ని గుర్తించారు. అది రహస్య కెమెరా అని అనుమానించి వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌లకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు. బాలికల భద్రత కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని పాఠశాలల్లో 'స్నేహిత క్లబ్స్' వంటివి ఏర్పాటు చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.