|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:21 PM
వీధికుక్కల సమస్యను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై తీసుకున్న చర్యలపై నివేదికలు దాఖలు చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం ప్రదర్శించింది. రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.దేశవ్యాప్తంగా వీధికుక్కల బెడద, వాటి దాడులకు సంబంధించిన పలు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, అనేక రాష్ట్రాలు ఇప్పటికీ చర్యల నివేదికలను సమర్పించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. "వీధికుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయంలో మీరేం చర్యలు తీసుకున్నారో చెప్పడానికి నివేదికలు ఎందుకు దాఖలు చేయడం లేదు? మీ వైఖరి వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది" అని ధర్మాసనం రాష్ట్రాల తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.ఈ సమస్య కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఉందని కోర్టు గుర్తు చేసింది. ప్రజల భద్రతకు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోవడం సరికాదని హితవు పలికింది. జంతువుల హక్కులను కాపాడుతూనే, మనుషుల భద్రతకు భరోసా ఇచ్చే సమతుల్యమైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.