|
|
by Suryaa Desk | Sun, Oct 26, 2025, 07:23 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాల తిరోగమనం సమయంలో ఇలాంటి తుపానులు ఏర్పడటం సర్వసాధారణం అయినప్పటికీ.. ఈసారి ఏర్పడుతున్న ఈ తుపాను కారణంగా తూర్పు , ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం.. తెలంగాణలో వర్షాల తీవ్రత, విస్తీర్ణం ఈ విధంగా ఉన్నాయి.
అక్టోబర్ 28న.. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు.. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ .
అక్టోబర్ 29న రెండో రోజున కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజున ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ , జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోయే ప్రమాదం ఉన్నందున.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరారు. ఈ రెండు రోజుల్లో ప్రజలు అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. చేపలు పట్టేందుకు వెల్లే మత్స్యకారులు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొంథా తుపాను కదలికను బట్టి.. మరిన్ని హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.