|
|
by Suryaa Desk | Sun, Oct 26, 2025, 03:09 PM
హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూ వంతెనపై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మొదట డివైడర్‌ను, ఆ తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్నది సూడాన్ దేశానికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం 7.50 గంటల సమయంలో రైతుబజార్ దాటిన తర్వాత ఓ కారు జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పైకి వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగంతో అదుపుతప్పిన ఆ కారు, వంతెనపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే వేగంతో ఓ బైక్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు సూడాన్ యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే యువతులు కారు దిగి, మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారు నడుపుతున్న యువకులు సూడాన్ దేశస్థులని, నగరంలో విద్యనభ్యసిస్తూ శంషాబాద్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.