|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 12:14 PM
కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు కొన్నింటిని సీజ్ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంబేలెత్తారు.రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 60కి పైగా వాహనాలను తనిఖీ చేయగా, నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు, భద్రతా ప్రమాణాలు లేని 8 బస్సులను అక్కడికక్కడే సీజ్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.మరోవైపు సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-3 వద్ద, రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద కూడా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను ఆపి సోదాలు నిర్వహించారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు, మెడికల్ కిట్ల లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎల్బీనగర్‌లోని చింతలకుంట వద్ద కూడా పలు వాహనాలపై కేసులు నమోదు చేశారు.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.