|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 10:27 PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఉన్నత స్థాయి అవినీతి ఆరోపణలు, అధికారుల వేధింపుల వంటి రాజకీయ కోణాలతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఆరోగ్య, వాణిజ్య పన్నుల శాఖల్లో పనిచేసిన సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. రిజ్వీకి నెలకు రూ. 10 లక్షల జీతంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఉన్నత స్థాయి ఉద్యోగం లభించిందని ప్రకటించారు.
ఈ భారీ జీతం కారణంగానే రిజ్వీ వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేశారని మంత్రి పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా మాజీ ఐఏఎస్ అధికారి రిజ్వీతో చర్చలు జరుగుతున్నట్లు పరోక్షంగా అంగీకరించాయి. మరోవైపు.. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించినందుకు.. అధికారులను వేధింపులకు గురిచేస్తోందని, అందువల్లే రిజ్వీ వీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపారని తిరిగి ఆరోపణలు చేసింది.
ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్ వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ విధులు సక్రమంగా సాగడానికి తీసుకున్న నిర్ణయాలను వక్రీకరించి ప్రజల్లో అపార్థం కలిగించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
జూపల్లి మాట్లాడుతూ.. “రిజ్వీ విషయం మీద కేటీఆర్ రాజకీయ లాభం కోసం అనవసరంగా హడావుడి చేస్తున్నారు. మద్యం సీసాలపై హోలోగ్రామ్ లేబుళ్లు అమలు చేయడం వలన నకిలీ సీసాల అమ్మకాలు తగ్గి, పన్ను ఆదాయం పెరుగుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం 2013 ఆగస్టు 21న కుదిరి, 2014 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2019లో ఆ ఒప్పందం ముగిసినా పాతదే కొనసాగింది. ఆ తర్వాత 2022లో కొత్త టెండర్ల కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రిజ్వీ ఆ ఆదేశాల ప్రకారం కమిటీని ఏర్పాటు చేసినా, తరచుగా మార్పులు చేసి ప్రక్రియను ఆలస్యం చేశారు. ఈ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి సుమారు రూ.230 కోట్ల మేర నష్టం కలిగింది. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కి ఫిర్యాదు చేశాను,” అని వివరించారు. తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవడం అనేది బాధ్యత అని జూపల్లి అన్నారు. “రిజ్వీ వీఆర్‌ఎస్ కోరుకున్నది ప్రభుత్వ ఒత్తిడికి కాదు, ప్రైవేటు ఉద్యోగ అవకాశాల కోసం. హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రి నెలకు రూ.10 లక్షల జీతం ఆఫర్ చేయగా.. దిల్లీలోని రెండు ప్రైవేటు సంస్థల నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. కానీ కేటీఆర్ దీనిని వక్రీకరించి, టెండర్లతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ఆయన పేర్కొన్నారు.