|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 07:24 PM
కర్నూలు జిల్లాలో నేడు ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు.. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగి 20 మంది వరకు మరణించారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం బస్సు అద్దాలు పగులకొట్టి బయటకు దూకారు. ఈక్రమంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలను వెలికి తీస్తున్నారు. యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సాయం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారని.. 23 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. ఈక్రమంలో తెలంగాణ సర్కార్ బాధితులకు పరిహారం ప్రకటించింది.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం.. అలానే గాయపడ్డ వారికి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ వెల్లడించారు. అయితే ఈ పరిహారం కేవలం తెలంగాణ వాసులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఇక ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలానే ప్రమాదంలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపింది. అలానే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.