|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 05:50 PM
హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ రద్దీకి చిరునామాగా మారింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నా.. ట్రాఫిక్ మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరుగాంచిన సైబరాబాద్ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక సరికొత్త ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా కంపెనీ బస్సులు, కార్ పూలింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. వీటిలో.. ఐటీ పార్కుల్లోని ఉద్యోగుల రాకపోకల కోసం వ్యక్తిగత వాహనాలు, సంస్థ పికప్-డ్రాప్ వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులను ఉపయోగించేలా ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకు ఒక కంపెనీకి చెందిన ఉద్యోగులందరూ ఒకే బస్సులో ప్రయాణించేలా చూడటం ద్వారా ఒకే మార్గంలో తిరిగే వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ విధానం వల్ల ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, కంపెనీలకు ఉద్యోగుల ప్రయాణ ఏర్పాట్ల వ్యయాలు కూడా ఆదా అవుతాయి.
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి వ్యక్తిగత స్థాయిలో కార్ పూలింగ్‌ను కూడా ప్రోత్సహించాలని పోలీసులు యాజమాన్యాలకు సూచించారు. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, కొండాపూర్ వంటి కీలక ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు ఒకే ప్రాంతం నుంచి ఒకే కంపెనీకి వేర్వేరు వాహనాల్లో వస్తున్నట్లు సైబరాబాద్ పోలీసుల అధ్యయనంలో గుర్తించారు. ఇది ట్రాఫిక్ రద్దీకి ముఖ్య కారణంగా మారింది. ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తే.. ఇంధన వ్యయం తగ్గడంతో పాటు, రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు.
మైండ్‌స్పేస్ పార్క్‌లోని వివిధ ఐటీ కంపెనీలు ప్రస్తుతం 250 కార్లను వినియోగిస్తున్నాయి. దీనికి బదులుగా, 50 బస్సుల్లో అంతే సంఖ్యలోని ఉద్యోగులను రవాణా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను మైండ్‌స్పేస్ ఐటీ పార్క్‌లో త్వరలో ప్రారంభించాలని పోలీసులు నిర్ణయించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో30 ఐటీ పార్కులు ఉన్నాయని.. ఒక్కో పార్కులో కనీసం 20 నుంచి 30 వరకు ఐటీ కంపెనీలు ఉన్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. తక్కువ వాహనాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు రాకపోకలు సాగించే ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే.. ట్రాఫిక్ రద్దీ కనీసం 20 శాతం మేర తగ్గుతుందని ఒక ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో కనిష్టంగా 60 ట్రాఫిక్ రద్దీ పాయింట్లు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గాల్లో కనిష్టంగా 10 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని అంచనా. సామూహిక రవాణా విధానాలు అమలులోకి వస్తే.. సైబరాబాద్ ట్రాఫిక్ రహిత నగరంగా మారుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.