|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:30 PM
లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తన జీవితంలో జరిగిన ఓ సున్నితమైన, తనను ఎంతగానో ప్రభావితం చేసిన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన ఉద్యోగ జీవితం తొలినాళ్లలో ఓ నిరుపేద మహిళ తన మనవడి చదువు కోసం పడిన ఆవేదన తనను తీవ్రంగా కదిలించిందని, ఆ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న జేపీ, ఆ సంఘటన గురించి వివరిస్తూ.. "అది 1983-84 మధ్యకాలం, నాకు పెళ్లైన కొత్త రోజులు. నేను సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు 50 ఏళ్ల వయసున్న ఓ పేద మహిళ, ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బందిగా పనిచేసేది. కొడుకు చనిపోవడంతో మనవడిని తనే పెంచుకుంటోంది. వాడిని ఓ ప్రైవేట్ మిషన్ స్కూల్‌లో చేర్పించాలని ప్రయత్నించింది, కానీ సీటు దొరకలేదు. ఆమె నా దగ్గరికి వచ్చి, ఫీజు కూడా కడతానని చెబుతూ నా కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చింది. ఈ దేశంలో ఓ నిరుపేద కుటుంబం తమ పిల్లల చదువు కోసం కన్నీళ్లు పెట్టుకుని కాళ్ల మీద పడే దుస్థితి ఉందంటే, సమాజంగా మనం సిగ్గుపడాలి. ఆ ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఈ దేశంలో కోట్ల మంది తల్లిదండ్రుల విషాదం అదే" అని ఆవేదన వ్యక్తం చేశారు.