|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 12:11 PM
రంగారెడ్డి జిల్లాలో ఓ ఏడు నెలల గర్భిణి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (22) అనే గర్భిణి, తరచుగా సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారు. ఇటీవల పరీక్షల సందర్భంగా ఆమెలో ఐరన్ లోపం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీనికి సంబంధించి తక్షణమే ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు.
ఈ సూచన మేరకు, శుక్రవారం రోజున మానస దగ్గరలోని మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కి వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆమెకు ఐరన్ ఇంజెక్షన్‌ను ఇచ్చారు. అయితే, ఇంజెక్షన్ తీసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే మానస ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ఉస్మానియాలో రెండు రోజులుగా మృత్యువుతో పోరాడిన మానస, శనివారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆశలన్నీ అడియాశలయ్యాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మంచాల పీహెచ్‌సీలో తీసుకున్న ఇంజెక్షన్ వికటించడం వల్లే తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ... వైద్యుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గర్భిణి మృతితో మంచాల పీహెచ్‌సీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. తమ ఆవేదనను తట్టుకోలేక కొంతమంది ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మృతురాలి భర్త పంతంగి ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.