|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:48 PM
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే నెలలో నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ కేసులో వీరిద్దరికి శిక్ష విధించాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది. ఆసక్తికరంగా.. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి తప్పుకున్నారు. గతంలో నిందితుల్లో ఒకరి తరఫున తాను వాదనలు వినిపించినందున ఈ కేసును విచారించలేనని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.
మంత్రిగా అనుమతులు..
అంతరగంగమ్మ కొండల్లో మైనింగ్ లీజులు కట్టబెట్టడంలో సబితా ఇంద్రారెడ్డి, కృపానందంల పాత్ర ఉందని సీబీఐ తన అప్పీలులో పేర్కొంది. వీరు కీలక పాత్ర పోషించడం వల్లే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని సీబీఐ ఆరోపించింది. కృపానందం 2005 నవంబర్‌లో ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని.. దీనికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారని వివరించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్దోషులుగా ప్రకటించిందని సీబీఐ వాదించింది.
బెయిల్‌పై గాలి జనార్ధన్ రెడ్డి..
సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సబితా ఇంద్రారెడ్డి, కృపానందానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీ ఖాన్, వీడీ రాజగోపాల్లకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానాను నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో విధించింది. అయితే.. తాజాగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరిన్ని విచారణలు, కోర్టులో జరిగే వాదనలు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.