|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:24 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం ఆరో రోజు కూడా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏడుపాయల ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది.ఆలయం వద్ద ఉన్న వనదుర్గ ఆనకట్టపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహం నేరుగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి, అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి పారుతోంది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. గత ఆరు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తుల దర్శనం కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఏర్పాటు చేసి, అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు రాజగోపురం నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న గర్భగుడి వైపు, వనదుర్గ ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. మంజీరా నదికి వరద తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు