|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 07:25 PM
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా.. వారి ఆర్థిక స్వావలంబన కోసం అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని మహిళల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి టౌన్‌లో మహిళా మార్ట్ లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన తొలి మహిళా మార్ట్ విజయవంతం కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు విక్రయ వేదికగా ఈ మార్ట్‌లు పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఖమ్మంలో ఇటీవల ప్రారంభమైన మహిళా మార్ట్ కేవలం ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు.. మహిళల కష్టానికి, నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ స్థానికంగా మహిళలు తయారు చేసిన చేతివృత్తుల వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ మార్ట్ విజయవంతంగా నడుస్తున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో.. ఆయన తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా ప్రశంసించారు. “ప్రజా ప్రభుత్వ సంకల్పం... అధికారుల కార్యచరణ... ఆడబిడ్డల ఆచరణకు... ప్రతిరూపం ఖమ్మంలో... దిగ్విజయంగా నడుస్తోన్న... ఈ 'మహిళామార్ట్' అంటూ ఆయన చేసిన పోస్టు చేశారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఇలాంటి మార్ట్‌లు రావాలని ఆయన ఆకాంక్షించారు.
మహిళా మార్ట్‌లతో పాటు, మహిళల కోసం ప్రభుత్వం మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలో కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించింది.
ఇవే కాకుండా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి వంటి ఇతర పథకాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడంతో పాటు, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలరని ప్రభుత్వం విశ్వసిస్తోంది.