|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:38 PM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.వర్షాల నేపథ్యంలో సీవరేజి ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్‌స్పాట్లను పర్యవేక్షించాలని, ఎక్కడైనా మ్యాన్‌హోళ్లు ఉప్పొంగితే వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. సీవరేజి తరచూ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను వెంటనే తొలగించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాగునీరు సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా మంచినీటి నాణ్యతను పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్లోరిన్ బిల్లలను ఇంటింటికి పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇప్పటికే ప్రమాదాలు జరగకుండా లోతైన మాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్లులు ఏర్పాటు చేశామని, దెబ్బతిన్న మాన్ హాళ్లను ద్వాంసం అయిన మాన్ హాళ్లను, కవర్లను క్రమం తప్పకుండా పునర్నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎంసిసి ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ, ముఖ్యంగా వర్షపు నీరు మురుగులో కలవడం వల్ల కలిగే కలుషత నీరు సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. వీటితో పాటు టర్బిడిటీ ఆధారంగా అలమ్ మోతాదులను సర్దుబాటు చేసి, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP) స్థాయిలో నీటి నాణ్యతను కాపాడాలని సూచించారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు రిజర్వాయర్ల వరద పరిస్థితిని ప్రతి గంటకోసారి పర్యవేక్షించి, నీటి ప్రవాహం ఉన్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. నిరంతర కార్యకలాపాల కోసం ఐసిసిసి (ICCC) తో పాటు హైడ్రా, జిహెచ్‌ఎంసి పోలీస్ డిపార్ట్మంట్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవవద్దని ఆయన కోరారు. మ్యాన్‌హోళ్లు తెరవడం జలమండలి యాక్ట్‌లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్‌హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేయాలని సూచించారు.