|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 07:34 PM
తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గుంతలమయమైన రోడ్లను బాగు చేయడానికి రూ. 622 కోట్లతో 17 ప్యాకేజీలను సిద్ధం చేసింది. 537 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల అభివృద్ధి పూర్తయితే ప్రయాణం సులభతరం అవ్వడమే కాకుండా, ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ రోడ్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి ముఖ్య సూచికలు మంచి రహదారులే. కానీ గత కొన్నాళ్లుగా తెలంగాణలో చాలా రోడ్లు సరిగా నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని రోడ్లు గుంతలమయమై వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, విస్తరణ కోసం 17 ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. నల్గొండ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల్లోని రోడ్లను రెండు ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
537.78 కి.మీ. రోడ్లకు రూ. 622 కోట్లు..
నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 44 రోడ్లను గుర్తించారు. ఈ రోడ్లు మొత్తం 537.78 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. వీటి మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 622 కోట్లతో అంచనాలను తయారు చేశారు. ఈ పనులను హ్యామ్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ పద్ధతిలో నిర్మాణ సంస్థ కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ఇది పనుల నాణ్యతను, వేగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రెండు జిల్లాల్లో ఎక్కువగా రద్దీ ఉండే, బాగా పాడైపోయిన రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఈ రెండు ప్యాకేజీలలో భాగంగా అభివృద్ధి చేయనున్న కొన్ని ముఖ్యమైన రోడ్లు ఇక్కడ ఉన్నాయి. మొదటి ప్యాకేజీలో ఉన్న అభివృద్ధి చేసే రోడ్లు... నల్గొండ-మహబూబ్‌నగర్, నల్గొండ-చౌటుప్పల్, నల్గొండ-కట్టంగూర్, మునుగోడు-చౌటుప్పల్, మునుగోడు-కొండాపూర్, ఇడికూడ-నారాయణపూర్, కచలపూర్-కిష్టాపురం, ఎంఎన్‌రోడ్డు-యాచారం (తుర్కపల్లి మీదుగా), ఎంఎన్ రోడ్డు-నాగార్జునసాగర్ రోడ్డు, నకిరేకల్-మూసీ (నోముల మీదుగా), కట్టంగూరు-ఈదులూరు, నకిరేకల్-గురజాల (కడపర్తి మీదుగా), కరుమర్తి-శాలిగౌరారం (ఆకారం), ఈదులూరు-తక్కెళ్లపాడు, తక్కెళ్లపాడు-మనిమద్దె రోడ్లు ఉన్నాయి.
రెండో ప్యాకేజీలో రోడ్లు.. సాగర్ పీడీబ్ల్యూ రోడ్డు-రాజవరం, పడమటపల్లి-శ్రీశైలం రహదారి, మాడ్గులపల్లి-సాగర్, డిండి-దేవరకొండ (బాపనకుంట మీదుగా), కొత్తపల్లి-అంజపూర్ (ధర్మాతండా మీదుగా), కుక్కడం-పాములపహాడ్, బొత్తలపాలెం-రాగడప, ముకుందాపురం-తుమ్మడం, బరాఖత్‌గూడెం-కాగితా రామచంద్రపురం, కోదాడ-రివర్ రోడ్డు, రాగినిగూడెం-బరాఖత్‌గూడెం, శాంతినగర్-నడిగూడెం, హుజూర్‌నగర్ లింక్‌రోడ్డు, రింగ్ రోడ్డు, దురాజ్‌పల్లి- గరిడేపల్లి, హుజూర్‌నగర్- యాతవాకిళ్ల, కోదాడ- రివర్‌రోడ్డు, హుజూర్‌నగర్- మేళ్లచెరువు, దామరచర్ల-జాన్‌పహాడ్, సూర్యాపేట-నెమ్మికల్, గౌరారంతండా-నెమ్మికల్, మాదారం-చీదెళ్ల రోడ్లు ఉన్నాయి.
ఈ రహదారుల అభివృద్ధి పూర్తయితే.. ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలను, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. మొత్తంగా.. ఇది నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.