|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 07:48 PM
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్య ప్రజలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టబడి ఉందని నిరూపించుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. తాజాగా రేవంత్ సర్కార్ కొందరు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారికి 5 శాతం అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులూ జారీ చేశారు. అలానే మరో విభాగం అధికారులకు కూడా గంపగుత్తగా అలవెన్స్ ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సదరు ఉద్యోగులకు రూ.6 వేలు, 8, 10 వేల రూపాలు అలవెన్స్‌గా లభించనున్నాయి. ఆ వివరాలు..
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని జెన్‌కో.. థర్మల్, హైడల్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం థర్మల్, హైడల్ కేంద్రాల్లో పని చేస్తున్న వారికి 5 శాతం జనరేషన్ అలవెన్సును వర్తింపజేస్తూ జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటుగా ట్రాన్స్‌కోలోని సీబీడీ, ఎస్‌ఎంజీ, ఎంఆర్‌టీ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సులు కల్పించనున్నట్ల వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఆర్ధికంగా ఊరట లభించనుంది.
జెన్‌కో ప్రకటించిన అలవెన్స్.. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)-ఏడో దశ, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వీరితో పాటుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులందరికి కూడా ఈ అలవెన్స్ వర్తింపు నిర్ణంయ వర్తించనుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అనగా 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ అలవెన్సు అమల్లోకి రానుందని అధికారులు ప్రకటించారు.
జెన్‌కో అలవెన్స్ ప్రకటనతో పాటుగా.. ట్రాన్స్‌కోలోని సీబీడీ, ఎస్‌ఎంజీ, ఎంఆర్‌టీ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారందరికి గంపగుత్తగా ప్రత్యేక సీబీడీ అలవెన్సును ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేడ్-2 వారికి నెలకు రూ.6 వేలు, గ్రేడ్-3 వారికి రూ.8 వేలు, గ్రేడ్-4 వారికి రూ.10 వేల చొప్పున అలవెన్స్ ఇవ్వనుంది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల సంఘం బూత్ లెవల్ ఆఫీసర్ల వేతనాన్ని రెట్టింపు చేస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగులకు ఒకే రోజు రెండు శుభవార్తలు వినడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం, జెన్‌కోకు ఆయా శాఖల ఉద్యోగులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.