![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 12:23 PM
ప్రముఖ సినీనటులు, ఆత్మీయ మిత్రులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించాను.ఎన్నో విలక్షణమైన పాత్రలలో, ఆకట్టుకునే నటనతో తెలుగుతో పాటు అనేక భారతీయ భాషలకు చెందిన ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న ఆయన... సహజ సిద్ధమైన హావభావాలు, పాత్రకు తగిన వాక్చాతుర్యంతో భారతీయ చలనచిత్ర సీమలో తనదైన ముద్ర వేశారు. తెలుగు భాష పట్ల వారికున్న అభిమానం, భాష పై వారికున్న పట్టు ప్రత్యేకమైనవి. పాత్రకు తగిన విధంగా చక్కని విరుపులతో, మాండలిక పదాలతో వారి సంభాషణలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి.నటునిగానే కాకుండా, భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యునిగా శ్రీ కోట శ్రీనివాసరావు అందించిన సేవలు అమూల్యమైనవి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం సహా, చలనచిత్ర రంగంలో వారు అందుకున్న అవార్డులు ఆయన నటనా వైదుష్యానికి తార్కాణాలు. శ్రీ కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.