![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 07:17 PM
రేవంత్ రెడ్డి తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సోమవారం ఆయన దేశ రాజధానికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన పూర్తిగా పాలనాపరమైన అంశాలపైనే దృష్టి సారించడం గమనార్హం.పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయి, తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాబోయే ఖేలో ఇండియా క్రీడలను, 2036 ఒలింపిక్స్‌లోని కొన్ని ఈవెంట్లను రాష్ట్రంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌తో సమావేశమై రాష్ట్రానికి యూరియా సరఫరా, జహీరాబాద్ స్మార్ట్ సిటీకి నిధులు, వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లకు ఆర్థిక చేయూత వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రాజకీయాలతో పాటు క్రీడా, సినీ రంగ ప్రముఖులతోనూ సీఎం సమావేశమయ్యారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో భేటీ కాగా, తెలంగాణలో క్రీడాభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా సీఎంను కలిసి రాష్ట్రంలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపారు. అయితే, ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ఎవరితోనూ భేటీ కాకుండానే తిరిగి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.