![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:23 PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర సారథిని అధిష్టానం నామినేట్ చేయడం సరికాదని, అంతర్గత ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా నావాళ్లు, నీవాళ్లు అంటూ నియామకాలు చేపడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఇప్పటికే ఒక వ్యక్తి పేరును ఖరారు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ తెలిపారు. ఈ పద్ధతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. "పార్టీ అధ్యక్షుడిని బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ముఖ్య నేతల వరకు అందరూ ఓటు వేసి ఎన్నుకోవాలి. అలా కాకుండా ఒకరిద్దరు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి" అని అభిప్రాయపడ్డారు.