|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 12:57 PM
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) చరిత్రలో ఓ కీలక మలుపు వచ్చింది. సంస్థలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా సరిత విధుల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని మీడియా ద్వారా వెల్లడించారు. సరిత మాట్లాడుతూ - "మహిళా సాధికారత దిశగా ఆర్టీసీ ముందడుగు వేసింది. నేను యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందినవాన్ని. ఇప్పుడు మిర్యాలగూడ డిపోలో జె.బి.ఎం. సంస్థ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్‌గా విధుల్లో చేరాను" అని తెలిపారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు నడిచే బస్సును నిర్వహిస్తున్నారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రస్థానాన్ని కూడా సరిత పంచుకున్నారు. ఢిల్లీలో 10 సంవత్సరాలు బస్సు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఆటో నడిపే రోజుల్లో ఓ మహిళా అధికారిణి పరిచయం కావడం వల్ల ఢిల్లీ రవాణా శాఖలో అవకాశం దక్కిందని చెప్పారు. "అప్పుడు 15 మంది మహిళల్లో నేను ఒక్కతేనే ఎంపికయ్యాను. అక్కడ 10 ఏళ్ల పాటు పనిచేశాను. కానీ నా కుటుంబం - ముసలి తల్లిదండ్రులు, అక్కలు, చిన్నదాన్ని దగ్గరుండి చూసుకోవాలని కొన్నిసార్లు విన్నవించుకున్నా - పూర్వ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడా కల నెరవేరిందని, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్‌గా విధుల్లో చేరడం గర్వంగా ఉందని చెప్పారు. సరిత విజయగాధ ఇప్పుడు ఎన్నో యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.