|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 01:48 PM
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే రుతుపవనాల రాక తో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించాయి.తిరిగి కొనసాగుతున్న వేసవి పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాల్లో ఈనెల పదో తేదీ తర్వాతే మళ్లీ పురోగతి కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. నాలుగు రోజుల నుంచి మందగించాయి. రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయిందని భావించారు. అయితే, నాలుగు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు తిరిగి పెరిగాయి. ఉక్కపోత కూడా పెరగటంతో ఇబ్బందులు తప్పటం లేదు. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకూ నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.రానున్న రెండు, మూడు రోజులు కోస్తాలో అనేకచోట్ల వేడి వాతావరణం నెలకొంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు, ఒకటిరెండుచోట్ల 40 డిగ్రీల వరకూ నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్దిరోజుల విరామం సాధారణమేనని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈనెల 10 తర్వాతే బంగాళా ఖాతంలో రుతుపవనాల కదలికకు అనువుగా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. 12 నుంచి రుతుపవనాల్లో మళ్లీ కదలిక రావచ్చునని వివరించారు. కాగా, బుధవారం కోస్తా జిల్లాల్లో ఉక్కపోత తోపాటు గరిష్ఠంగా 39-40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.