|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:34 PM
కాళేశ్వరంపై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్ రావు.. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు(ఫోటోలు- Samayam Telugu)
తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను పూర్తి చేసి.. వందల పేజీల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను పరిశీలించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్.. దానికి ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతిని తేల్చేందుకు.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్టును.. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరూ వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పూర్తిగా తప్పులతో నిండిపోయి ఉందని కేసీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్‌రావు రెండు వేర్వేరు పిటిషన్లను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏది కావాలో.. దాని ఆధారంగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తయారు చేసి ఇచ్చిందని.. సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన ఈ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును కొట్టివేయాలని వారు కోరారు.
మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి అందించిన నివేదికకు ఇటీవలే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం కల్పించింది. ఈ విచారణకు సంబంధించిన వివరాలను పీసీ ఘోష్ కమిషన్ సవివరంగా రిపోర్టులో పొందుపరిచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ రిపోర్టును త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కాళేశ్వరం రిపోర్టులో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తామని తేల్చి చెప్పారు. అయితే మొదటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను తప్పుపడుతున్న బీఆర్ఎస్.. తాజాగా హైకోర్టుకు ఎక్కింది.