|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 08:35 PM
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు.
ఎన్నికల వాయిదాకు సంకేతాలు..
ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 16, 17 వ తేదీల్లో పీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా అది కుదరలేదు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ చివరినాటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కానందున కోర్టును గడువు కోరతామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. పీఏసీ సమావేశంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల ప్రకారం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుందా లేక వాయిదా కోరుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై క్షేత్రస్థాయిలో ప్రజలు, ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేకపోవడం వల్ల నిధుల విడుదల జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, సమస్యలు పేరుకుపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు పీఏసీ సమావేశం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. పీఏసీ సమావేశం తర్వాత అధికార పక్షం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.