|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 08:22 PM
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని మోటార్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.ప్రస్తుతం కాళేశ్వరం పంపుహౌస్‌లలోని మోటార్లను రోజుకు రెండు నుంచి మూడుసార్లు అనవసరంగా ఆన్, ఆఫ్ చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలా తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తిరిగి ప్రారంభించడం వల్ల మోటార్లలోని కీలకమైన బేరింగ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్లు పాడైపోయిన తర్వాత, దానిని సాకుగా చూపి తమను బద్నామ్ చేయాలన్నదే ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు.ఈ విషయంపై భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అధికారులు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారని హరీశ్ రావు గుర్తుచేశారు. మోటార్లను ఈ విధంగా ఆపరేట్ చేయడం సురక్షితం కాదని వారు స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం వారి సూచనలను పెడచెవిన పెడుతోందని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.