|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 07:41 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలతో మాట్లాడటం లేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును యథాతథంగా చదువుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పూర్తిగా 'బనకచర్ల కుట్ర'కు అనుకూలంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి, చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.గోదావరి జలాల వినియోగంపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి నీటిపై కొత్తగా మరో ప్రాజెక్టు నిర్మించడానికి ఏమాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.