![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:26 PM
ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్ కు చెందిన పార్కును కాపాడింది. 1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేసారు. ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేసారు. అటునుంచి నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని కలసి యిదే విషయాన్ని ఫిర్యాదు చేసారు. వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారికి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలసి హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. ఆ వెంటనే పార్కు ప్రహరీ నిర్మించింది. 3 గంటల్లోనే సమస్య పరిష్కారం అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేవు.. శనివారం ఉదయం వేకువ జామునే పార్కులోకి వచ్చిన నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును చూసి మురిసిపోయారు. ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. హైడ్రా చర్యలను అభినందించారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.